తెలంగాణ కేబినేట్‌ కీలక నిర్ణయాలు | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 2 2018 2:44 PM

Kadiyam Says Again Will Meet Cabinet  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో బీసీలకు రూ. 70 కోట్లతో 70 ఎకరాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఆదివారం సీఎం కేసీఆర్‌తో జరిగిన కేబినేట్‌ భేటి అనంతరం తెలంగాణ మంత్రులు ఈటెల రాజేంధర్‌, హరీష్‌ రావు, జోగురామన్న, కడియం శ్రీహరిలు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలను మాత్రమే తీసుకున్నామని కడియం శ్రీహరి తెలిపారు. త్వరలోనే మరోసారి కేబినెట్ భేటీ జరగనుందని, ఆ కేబినెట్ భేటీలో అన్ని నిర్ణయాలు తీసుకుంటామని  స్పష్టం చేశారు. 

తాజా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను తెలిపారు. హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ కోసం మరో 5 ఎకరాలు కేటాయింపు, గోపాల మిత్రులకు వేతనం రూ. 3,500 నుంచి రూ. 8500 పెంపు, అర్చకుల పదవీ విరమణ వయసు 58 నుంచి 65 ఏళ్లకు పెంపు, ఆశా కార్యకర్తల గౌరవ వేతనం రూ. 6 వేల నుంచి 7500లకు పెంచుతూ నిర్ణయం, వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంలుకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలకు పెంపు, ఎన్‌యూహెచ్‌ఎంలో పని చేస్తున్న 9 వేల మందికి కనీస వేతనాలు పెంపు, కాంట్రాక్ట్ డాక్టర్ల వేతనం రూ. 40 వేలకు పెంచినట్లు ప్రకటించారు. ఇక ముందస్తు ఎన్నికలు, పలు సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరగగా మంత్రులు వాటి గురించి ఏం ప్రస్తావించలేదు. వీటిపై కొంగర్‌కలాన్‌ సభలో సీఎం కేసీఆర్‌ స్పష్టతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement